22, జనవరి 2013, మంగళవారం

గుట్కా తింటే

గుట్కా తింటే గుటుక్కే

శీతల పానీయాలు తాగే ప్లాస్టిక్‌ గొట్టంతో ఎప్పుడైనా భోజనం చేశారా? పాతికేళ్ల మాధవ్‌ ప్రతిరోజూ ఆ పనే చేస్తాడు.పాత పేపర్ల షాపు యజమాని ఒకరు రోజూ ఒక పాత్రలో జావ మాత్రమే పోసుకుని తాగుతాడు. ఇలాగని ఇతనికేం వయసైపోలేదు. కేవలం 36 ఏళ్లే. మరి జావే ఎందుకు తాగుతాడంటే...ఆయన నోటి వెడల్పు చొక్కా గుండీ సైజుకి మించదు. నోటి కండరాలు కుంచించుకుని బిగుసుకుపోవడంతో ఆయన తనకిష్టమైన సమోసాలు, పానీ పూరీ తినలేకపోతున్నాడు. అందుకు కారణం కూడా చెప్పలేడు. పెదవులు బాధతో వణుకుతాయి. ఇదివరలో ఎంతో చక్కగా మాట్లాడిన అతను ఇప్పుడు గొణగడం మినహా ఏం చేయలేడు.నాల్గవ తరగతి చదివే వెంకట్‌ నోరు తెరవలేడు. తొమ్మిదేళ్లకే ఇంత కష్టమెందుకొచ్చిందో తెలీక తల్లిదండ్రులు వాడిని  ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు నోటి క్యాన్సర్‌ అని చెప్పారు. ఇంత చిన్న వయసులో ఈ జబ్బెందుకొచ్చిందని ఆశ్చర్యపోతారెవరైనా. అయితే వాడికి క్యాన్సర్‌ ఎందుకొచ్చిందో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. వెంకట్‌ అమ్మానాన్నలు గుట్కాతినేవారు. వారిని చూచిన ఆ చిన్నారి కూడా సరదాగా దాన్ని తినసాగాడు. చివరికి అదే వాడి పాలిట శాపమైంది. మొదట పేర్కొన్న ఇద్దరి బాధకు కారణం కూడా మాయదారి గుట్కానే. మహారాష్ట్రను శాసించి దేశ ప్రధాని పదవికి పోటీపడిన ఓ కేంద్ర మంత్రికి కూడా గుట్కా వల్ల నోటి క్యాన్సర్‌ వచ్చిందంటే నమ్ముతారా!ఇలాంటి గాథలు, కథలు, బాధలు చెప్పుకోడానికి ఎన్నెన్ని పేజీలు చాలవు.

మూడు వేళ్ల వెడల్పున్న తళుకు కాగితం సంచులు ఏ కిళ్లీ కొట్టులో చూసినా, పాన్‌ డబ్బాలలో చూసినా దర్శనమిస్తుంటాయి. పల్లె పట్నం అన్న తేడా లేకుండా అన్ని ప్రదేశాలకూ వ్యాపించిన ఈ చిన్ని పొట్లాం గుట్కా. దీనిని తీసుకెళ్లడం తేలిక. అంతేకాక అన్ని చోట్లా దొరుకుతుంది. మారు మూల గ్రామాలలోకీ చొచ్చుకుపోయింది. ఇందులో వక్క, పచ్చి వక్క, సున్నం, పొగాకు తదితర పదార్థాలు వుంటాయి. దీని మూలంగా అనేక రకాల క్యాన్సర్లు వస్తాయని, వైద్యులు మొత్తుకుంటున్నా ఆగేదెవరు?రోడ్డు పక్కన ఏ బడ్డీకొట్టు దగ్గరైనా సరే కాసేపు నిలబడితే చాలు! చిన్న చిన్న పిల్లలు సైతం వచ్చేసి 'అంకుల్‌! ఒక చాంపియన్‌ ఇవ్వండి' అంటూ రూపాయి బిళ్ల డబ్బామీద పెట్టేస్తారు. కూలి పని చేసుకునేవారు సైతం పని మధ్యలో వచ్చేసి 'రెండు పాన్‌ పరాగ్‌ ఇవ్వు' అంటూ డబ్బులు అందిస్తుంటారు. షాపతను ఇంత పొడుగు దండలోంచి గుట్కా పాకెట్లు చించి ఇస్తుంటాడు. కొట్టు ముందు నుంచి కదలకుండానే నోటితో పాకెట్‌ను ఓ మూల చించేస్తారు. లేత గోధుమ, తెలుపు రంగుల్లో నిక్షిప్తమైన పదార్థాన్ని ముందుగా అరచేతిలో వేసుకుంటారు. తర్వాత ఇలా నోట్లో వేసుకుని బుగ్గన పెట్టేస్తారు.

ఇలా ఒక పొట్లాం తర్వాత మరొకటి...వేస్తూనే వుంటారు. ఏళ్ల తరబడి దీన్ని తినడం వల్ల నోరు ముఖ్యంగా బుగ్గలు, నాలుక బండబారిపోతాయి. నోటి లోపలి పొరల్లో ఫైబ్రోసిస్‌ అనే వ్యాధి వచ్చి తిష్టవేస్తుంది. ఇది సోకిన వారికి నోరు తెరవడం కూడా బాధగా వుంటుంది. సాధారణ వ్యక్తులకు క్యాన్సర్‌ సోకే అవకాశం కన్నా ఫైబ్రోసిస్‌ వ్యాధి పీడితులకు క్యాన్సర్‌ వచ్చే అకవాశం 400 రెట్లు ఎక్కువ. ఫైబ్రోసిస్‌ మొదలైన అయిదేళ్ల నుంచి పదేళ్ల లోపల క్యాన్సర్‌ వస్తోంది. నోటి లోపల ఎంత ఎక్కువ సేపు వాటిని పెట్టుకుంటే అంత ఎక్కువగా క్యాన్సర్‌ వచ్చే అవకాశం వుంది. ఈ వ్యాధి రోగి నోటినీ, ముఖాన్నీ వికారం చేస్తుంది. నానా రకాల బాధలతో తీసుకుని తీసుకుని మరణించేలా చేస్తుంది. తమాషా ఏంటంటే...ఎంతో ప్రమాదకరమైందిగా భావించే సిగరెట్‌ కంటే గుట్కా మరింత ప్రమాదకరమైంది. ఇందులో పొగాకు కలిసి వుండడమే అందుకు కారణం. పొగాకులో వందల కొద్ది విష పదార్థాలున్నాయి. కాల్చే ప్రతి సిగరెట్‌లో నికోటిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, తార్‌ వుంటాయి. పొగాకులోని కార్బన్‌ మోనాక్సైడ్‌ రక్తానికి సరఫరా అయ్యే ఆక్సిజన్‌ మోతాదు తగ్గిస్తుంది. పొగాకులోని తారు క్యాన్సర్‌ వ్యాధిని కలిగిస్తుంది. క్యాన్సర్‌ వ్యాధిని కలిగించడానికి సిగరెట్‌కు పట్టే సమయంలో సగమే గుట్కాకు పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఓ తండ్రి తన కొడుక్కి సిగరెట్‌ ఇవ్వలేకపోయినా గుట్కా పాకెట్టును మాత్రం సులభంగా చేతిలో పెట్టేస్తాడు. దీనిలో దాగిన ప్రమాదం తెలీకనే ఇదంతా. మొత్తం క్యాన్సర్‌ రోగుల్లో నోటి క్యాన్సర్‌ రోగులు దాదాపు పదోవంతు మంది వున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. విదేశాల్లో ఈ క్యాన్సర్‌ రావడం చాలా అరుదు. నోరు పండించే తాంబూలం స్థానాన్ని పాన్‌మసాలాలు, గుట్కాలు ఆక్రమిస్తున్నాయి. వీటి బాధితులంతా 35 ఏళ్ల లోపు వారే. వీటిని అరికట్టలేకపోతే ఈ శతాబ్దాంతానికి నోటి క్యాన్సర్‌ రోగుల సంఖ్య తారాస్థాయికి చేరుతుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

ఎందుకు వాడతారు?

అసలు ప్రాణాంతకంగా మారే పొగాకును వివిధ రకాలుగా ఎందుకు వాడతారు? అసలు ఆ అలవాటును ఎందుకు చేసుకుంటారు? ఇందుకు సామాజిక, ఇతర అనేక కారణాలున్నాయి. స్నేహితులు షోకుగా, జాలీగా తాగడం, తీసుకోవడం చూసి వాటి ఆకర్షణలో పడతారు. పార్టీలలో వక్కపొడి, సిగరెట్లు ఇవ్వడం వల్ల కొంత మంది వాటిని అలవాటు చేసుకుంటారు. ఇక మరికొందరు రాత్రిపూట నిద్ర మేలుకోవడానికో, విశ్రాంతి తీసుకోవడానికో పొగతాగడం, జర్దాలు, పాన్‌పరాగ్‌లు వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. రాత్రి పూట డ్రైవర్లు ఎక్కువసేపు మేల్కొని వుండడానికిగాను వక్కలు, జర్దాలు, పాన్‌పరాగ్‌లు నోటిలో పెట్టుకుంటుంటారు. సిగరెట్లు కాలుస్తుంటారు. పెద్దలను చూసి పిల్లలు కూడా మొదలెడతారు. ఇలా ఒక ప్రమాదకర వలయంలా ఇది అలవాటౌతుంటుంది.

దగ్గరకు చేరరు

గుట్కా, పాన్‌ మసాలా, జర్దాలు తినేవారి దగ్గరకు చేరడానికి ఎవరైనాసరే తటపటాయిస్తారు. ఆఖరుకు స్నేహితులు, బంధువులు, కట్టుకున్నవారు కూడా. ఆ విధంగా అందరి ఛీత్కారాలకు గురవుతారు. ఆ వాసనను అందరూ అసహ్యించుకుంటారుకూడా. అలాంటి వారిని అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. కొందరు తెలియకుండా పెళ్లి చేసుకున్నా ఆ తరువాత సంసారంలో వారి మధ్య చీదరింపులు, చీత్కారాలతో ముద్దు ముచ్చట్లు కూడా కరువవుతాయని చెబుతారు. 16-18 ఏళ్ల ప్రాయంలో చుట్టు పక్కల స్నేహితులతో సరదాగా గుట్కా, పాన్‌మసాలాతో ప్రారంభమయ్యే స్నేహం దురలవాట్లకు బానిసలుగా మార్చేస్తుంది. పళ్లన్నీ గారపట్టి ఎర్రగా అసహ్యంగా తయారై ఎవ్వరూ దగ్గరకు చేరనంతగా తయారవుతారు. చిన్న వయసులోనే క్యాన్సరుకు గురయి మరణిస్తుంటారు. అలా పదిమందిలో 9 మంది నోటి క్యాన్సరుతో మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా చదువుతలేని వారు, కొద్దిపాటి చదువుకున్నవారు, కొందరు బాగా చదువుకున్న మధ్యతరగతి కుటుంబాల వారు గుట్కా, పాన్‌మసాలా, జరదాలకు అలవాటుపడి క్రమేణా క్యాన్సర్‌ వ్యాధి బారిన పడిపోతున్నారు. సరదాగా ప్రారంభమైన గుట్కా నమిలే అలవాటు క్యాన్సర్‌ వ్యాధి ప్రారంభం కాగానే పళ్లు ఊడిపోవడం, ఆహారం జీర్ణంకాకుండా పోవడం దగ్గర నుంచి ఆ తర్వాత మాట్లాడే స్థితి కూడా లేకుండా పోతుంది. జీర్ణవ్యవస్థ పాడవుతుంది. రాత్రుళ్లు నిద్ర సరిగా పట్టదు. కొన్నాళ్లకు నోరుకూడా తెరుచుకోలేని స్థితి వల్ల ద్రవపదార్థాలను గొట్టాల ద్వారా కడుపులోకి పంపించే స్థితికి చేరిపోతారు. అలా క్రమేణా స్వల్ప కాలంలోనే గుట్కాలు, జర్దాలు, పాన్‌మసాలాల కారణంగా క్యాన్సర్‌ వ్యాధితో మరణిస్తున్నారు. రూపాయి, రెండు రూపాయల గుట్కా లక్షలాది రూపాయల ఖర్చును, క్యాన్సర్‌ జబ్బును మోసుకొచ్చి ప్రాణాలను హరిస్తుంది.

 


ప్రభుత్వానికి పట్టదా!

ఇన్ని కోట్ల మంది ఆరోగ్యాలతో చెలగాటమాడే గుట్కాల గురించి ప్రభుత్వానికి పట్టదా? అనిపించొచ్చు. గతంలో మన కేంద్ర ప్రభుత్వం గుట్కాల ఉత్పత్తినీ, విక్రయాన్ని నిషేధించింది. కానీ ఏ మూలకెళ్లి ఏ చిన్ని బడ్డీ కొట్టులో చూసినా గుట్కా పాకెట్ల దండలు మెరుస్తూ కనిపిస్తాయి. నిషేధం విధిస్తే సరిపోతుందా! అమలులో చిత్తశుద్ధితో అమలు జరపాలిగాని!! దేనిపైనైనా నిషేధం విధిస్తే సరిపోదు. దానిపై నిఘా అత్యంత అవసరం. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం కలిగించడం మరింత అవసరం. మరో ముఖ్యమైన విషయం వుంది. పొగాకు పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు పండించేలా చైతన్య పరచాలి. అందుకు ప్రోత్సాహకరంగా సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందులు అందించాలి.

భయంకర జబ్బు

నోటి క్యాన్సర్‌ డబ్బు పోసి మరీ కొనుక్కునే భయంకర జబ్బు. ఏ అవయవానికి క్యాన్సర్‌ వస్తే దాన్ని కోసి తీసేయడమే. నాలుకకు వస్తే నాలుకను కోసిపారేస్తారు. బుగ్గకొస్తే బుగ్గను కోస్తారు. పెదవికొస్తే పెదవిని కోసేస్తారు. నోటి క్యాన్సర్‌ బుగ్గకు వస్తే బుగ్గకు రంధ్రం పడుతుంది. నోటి క్యాన్సర్‌ వచ్చినవారి ఫొటోలను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. మరెప్పుడూ నోటి క్యాన్సర్‌ కారకాలైన పాన్‌పరాగ్‌, గుట్కా, జర్దా, పాన్‌మసాలా, చుట్ట, బీడీ, సిగరెట్‌, పచ్చి వక్కపొడి వగైరా వాటి జోలికి ఎన్నడూ పోకూడదన్న భయం కలగజేస్తుంది. కానీ చాలామందిలో ఆ భయం శాశ్వతంగా వుండదు. అలవాటును మానలేరు. అందుకే తెలిసి తెలిసీ నోటి క్యాన్సర్‌ బారినపడతారు. భయాన్ని శాశ్వతం చేసుకున్నవారు ఆ ప్రాణాంతక అలవాటును శాశ్వతంగా మానివేసి తమను తాము కాపాడుకోగలుగుతారు.

నోటి క్యాన్సర్‌ వచ్చినవారిలో 90 శాతం మంది పొగాకు, వక్క ఏదో ఒక రూపంలో వాడేవారే. దీన్ని బట్టి అవి ఎంత ప్రమాదకరమైనవో చెప్పాల్సిన పనిలేదు. కానీ మన దేశంలో మాత్రం గుట్కాలు, పాన్‌లు, పాన్‌పరాగ్‌లు సేవించేవారి సంఖ్య పెరిగిపోతోంది. మహిళలు, పిల్లలు, యువకులు వాటిని ఒక ఫ్యాషన్‌గా తీసుకుంటూనే వున్నారు. ముఖ్యంగా యువతరం ఈ వ్యసనానికి బానిసవుతోంది. అందుకేనేమో ఏదేశంలోనూ లేనివిధంగా 10-12 సంవత్సరాల లోపువారే నోటి క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.భయంకరమైన నోటిక్యాన్సర్‌ నుంచి ప్రజలను ముఖ్యంగా యువతను విముక్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. మన రాష్ట్రంలో కూడా గుట్కాలు, జర్దాలకు వ్యతిరేంగా ఉద్యమాలు జరిగాయి.

కట్టడి చేయాలి

రూపాయి చేతిలో వుంటే చాలు! ఆ ప్రాణాంతక పొట్లాన్ని కొనుక్కొని నోట్లో వేసుకోవచ్చు. చవగ్గా వుండడం వల్ల కూడా దాన్ని ఎక్కువగా తింటున్నారు. మరి ఇంత ప్రమాదకరమైన గుట్కాలను నిషేధించొచ్చు కదా అనిపిస్తుంది ఎవరికైనా. నిషేధం సంగతి తర్వాత. సిగరెట్‌ విషయంలోనే అది సరిగ్గా అమలు జరగడం లేదు. ప్రభుత్వాలు ఆ విషయంలో ఎన్నిసార్లు విఫలమవలేదు! అందుకే ముందు కనీసం దీనిపై ప్రభుత్వ నియంత్రణ అయినా గట్టిగా వుండాలి. భారీగా పన్నులు వడ్డించడం ద్వారా కూడా ప్రభుత్వం దాని ఉపయోగాన్ని తగ్గేలా చేయవచ్చు. ఆ విధంగా లభించే సొమ్మునే తిరిగి దాని దుష్ఫలితాలను ప్రజలకు తెలియచేసే ప్రచారానికి ఉపయోగించవచ్చు. ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు అలాంటి చర్యలేవీ లేవు. రూపాయి నుంచి ఎనిమిది రూపాయలు పెడితే పొట్లాం వచ్చి చేతిలో పడుతోంది. మొదట మనం చెప్పుకున్న బాధితుల మాదిరిగా కోట్లాది మంది ప్లాస్టిక్‌ గొట్టాలలో ఆహారం తినకుండా వుండాలంటే... గుట్కాలపై నిషేధం విధించాలి. అదీ చేతకాదనుకుంటే కనీసం నియంత్రణ అయినా చేయగలగాలి. లేకపోతే గుటుక్కే.

మానడానికి చిట్కాలు

పాఠశాలలకెళ్లే విద్యార్థుల నుంచి పనిపాటలు చేసుకునే వారి వరకు గుట్కా నములుతూనే వుంటారు. గుట్కా మానాలానుకునే వారికి కొన్ని చిట్కాలు ....
*ఎంత త్వరగా గుట్కా బారి నుండి బయట పడతామనే విషయం వారు ఎంతకాలంగా దీనికి బానిసగా ఉన్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
*అన్నిటికంటే ముఖ్యమైంది మనలో గుట్కాను మానాలనే దృఢ నిశ్చయం కలిగివుండడం.
*ఒక్కసారిగా కాకుండా నమిలినప్పుడల్లా నెమ్మదిగా, రోజుకు, వారానికి కొంత తగ్గిస్తూ ఉండాలి. అదే సమయంలో లవంగాలను, ఇలాచీలను నములుతూ ఉండాలి.
గుట్కా నమలడం ఒక్కసారిగా మానకూడదు. నెమ్మదిగా మానాలి. లేకపోతే నమిలేప్పుడు ఉపయోగపడే కండరాలకు ప్రమాదం. అరుగుదల కూడా మందగిస్తుంది. నోటిలోని కండరాలు గుట్కా నమలడం వల్ల గట్టిపడతాయి. కాబట్టి ఆ కండరాలకు రోజూ వ్యాయామం అవసరం. అందుకే గుట్కాకు బదులు ఎండిన ఉసిరి, ఇలాచీలను నమలడం అలవాటు చేసుకోవాలి. గుట్కాను నమలడం మానడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే అందులో నికోటిన్‌ అనే పదార్థముంటుంది. అందుకే మొదట్లో రెంటినీ నములుతూ ఉండాలి.
రతక్కువ నికోటిన్‌ ఉండే గుట్కాను ఎంపిక చేసుకోవాలి. తక్కువ ఖరీదున్న గుట్కాలో ఎక్కువ నికోటిన్‌ ఉంటుంది.
*గుట్కా ప్యాకెట్‌ కొనుక్కున్న వెంటనే తినకుండా కాసేపు కోరికను అణచుకోవాలి. దీని కంటే ఇష్టమైన వాటి వైపు (సంగీతం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం వంటివి) ధ్యాసను మరల్చాలి. అయినా దానివైపే మనసు లాగితే ఎప్పుడూ తీసుకునేదానిలో సగం గుట్కాను తీసుకోవాలి.
పీచు పదార్థాలు ఉన్న ఆహారం (బజ్జీలు, ఉల్లిగడ్డలు... వంటివి), జ్యూసులు ముఖ్యంగా పైనాపిల్‌, నారింజ రసాలు గుట్కా తిన్నన్ని రోజులు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
గుట్కాలు మానేయడం పెద్ద కష్టమైన పనేంకాదు. ఓపికగా ఉంటే ఒక ఆరు నెలల్లో ఆ అలవాటును మానేయగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి