22, జనవరి 2013, మంగళవారం

అణు విద్యుత్ అనవసరం

అణు శక్తి లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీరతాయి 

-ఐ.ఐ.ఎస్.సి అధ్యయన నివేదిక

 


అణు విద్యుత్ తో పని లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. బెంగుళూరులోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐ.ఐ.ఎస్.సి) కి చెందిన ప్రొఫెసర్లు తయారు చేసిన అధ్యయన నివేదిక ఈ సంగతి ప్రకటించింది. సౌర విద్యుత్తుతో పాటు ఇతర సాంప్రదేయేతర విద్యుత్ వనరుల ద్వారా భారత దేశం యొక్క పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని ‘కరెంట్ సైన్స్’ అనే పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక తెలిపింది. అణు విద్యుత్ తప్ప మరో దారి లేదని ప్రధాని మన్మోహన్ తో సహా అనేకమంది ప్రభుత్వ పెద్దలు, కంపెనీల శాస్త్రవేత్తలూ చెబుతున్నదానిలో నిజం లేదని ఈ నివేదికలోని అంశాలు స్పష్టం చేస్తున్నాయి.
ఐ.ఐ.ఎస్.సి లో ప్రొఫెసర్లుగా పని చేస్తున్న హీరేమత్ మీటావచన్, జయరామన్ శ్రీనివాసన్ లు అధ్యయన నివేదికకు రచయితలు. ఐ.ఐ.ఎస్.సి, ప్రపంచ స్ధాయిలో ప్రతిష్ట పొందిన సంస్ధ. ఈ సంస్ధలోని ‘దివేచ సెంటర్ ఫర్ క్లైమేట్ ఛేంజ్’ తరపున జరిగిన అధ్యయనం ప్రధాన స్రవంతి మీడియా సాగిస్తున్న వివిధ ప్రచారాల్లోని డొల్లతనాన్ని బదాబదలు చేసింది. ముఖ్యంగా, ‘సౌర విద్యుత్తును పూర్తిస్ధాయిలో వినియోగించుకోగల భూ వనరులు భారత దేశానికి లేవు’ అన్న వాదనను ఈ అధ్యయనం తిరస్కరించింది.
జల విద్యుత్తు, ధర్మల్ (బొగ్గు) విద్యుత్తు, అణు విద్యుత్తుల ఉత్పత్తి కోసం అవసరమైన భూమి కంటే తక్కువ భూ వనరులతోనే సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని ఈ అధ్యయనం తేల్చింది. సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగంలో పెద్ద మొత్తంలో భూమి వృధా పోతుందనీ, సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే భూమిని ఒకవైపు సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తూనే మరో వైపు పశువులకు మేతను ఉత్పత్తి చేసేందుకు కూడా వినియోగించవచ్చని తెలిపింది. భారతదేశంలో సాగుకు ఉపయోగపడని భూములు, వృధా భూములు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇందులో కేవలం 4.1 శాతం భూమిని వినియోగించినా భారత దేశ అవసరాలకు సరిపోయిన సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని ఐ.ఐ.ఎస్.సి అధ్యయనంలో స్పష్టం అయింది.
2070 సంవత్సరానికల్లా సంవత్సరానికి 3400 TWh (టెట్రా వాట్ అవర్ -ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసే ఒక టెట్రా వాట్ అవర్ 114 మెగా వాట్లకు సమానం) విద్యుత్ భారత దేశానికి అవసరం అవుతుందనీ, ఈ విద్యుత్ అంతా వృధా భూమిలోని 4.1 శాతాన్ని వినియోగించి సౌర విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేయవచ్చని అధ్యయనం తెలిపింది. ఇతర సాంప్రదాయేతర వనరులను కూడా వినియోగంలోకి తెచ్చినట్లయితే ఈ భూమి శాతం 3.1 శాతానికి తగ్గిపోతుందని కూడా అధ్యయనం తెలిపింది. ప్రభుత్వాలు, ఇతరులు వాదిస్తున్నట్లుగా సౌర విద్యుత్ ఉత్పత్తికి భూవనరుల అందుబాటు అసలు సమస్యే కాదని తెలిపింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోలార్ ఫోటోవోల్టాయిక్ (పి.వి) టెక్నాలజీ ఆధారంగా మాత్రమే ఈ లెక్కలు వేశామని అధ్యయనం తెలిపింది. నూతన తరహా సోలార్ సెల్స్ సాధించిన ఉన్నత స్ధాయి సామర్ధ్యాన్ని ఈ లెక్కల్లో పరిగణించలేదు. అంతేకాకుండా ఇళ్లపైన కూడా సౌర పలకలను ప్రతిష్టించుకోగల వసతిని కూడా ఈ అధ్యయనం పరిగణించలేదు. అదనపు భూ వనరుల అవసరం లేకుండానే ఇళ్లపైన సౌర పలకలు ప్రతిష్టించుకోవచ్చు గనక ఆ మేరకు భూ వనరుల అవసరం ఇంకా తగ్గిపోతుంది.
భారత దేశ విద్యుత్ అవసరాలపై గత సంవత్సరం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించిన నివేదికను ఐ.ఐ.ఎస్.సి అధ్యయన నివేదిక దాదాపు నిర్ధారించిందని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నివేదిక ఇలా పేర్కొంది. “సూర్యుడినుండి నేరుగా వచ్చే కిరణాలను దృష్టిలో పెట్టుకుంటే, సూత్ర రీత్యా, దేశం మొత్తం విద్యుత్ అవసరాలను తీర్చడానికి అవసరమైన భూమికంటే ఎక్కువే భారత దేశంలో ఉంది.” భారత దేశ సౌర విద్యుత్ వినియోగానికి సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం చూడగలిగిన శాస్త్రీయతను భారత ప్రభుత్వం చూడలేకపోవడం అత్యంత దయనీయం. విదేశీ బహుళ కంపెనీల లాభ దాహాన్ని సంతృప్తిపరచడంలోనే నిమగ్నమైన భారత పాలకుల దృష్టికి శాస్త్రీయ దృక్పధంతో పనిలేదన్నది స్పష్టమే.
సౌరవిద్యుత్ ఉత్పత్తిలోని భూ వినియోగాన్ని సాంప్రదాయ విద్యుత్ వనరులలోని భూవినియోగంతో అధ్యయనం పోల్చింది.  అంటే ధర్మల్, అణు, జల విద్యుత్ ఉత్పత్తులలో వినియోగం అయే భూ విస్తీర్ణంతో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన భూ విస్తీర్ణాన్ని పోల్చింది. అనంతరం భవిష్యత్తులో అవసరం అయే విద్యుత్ ఉత్పత్తికి కావలసిన భూ విస్త్రీర్ణాన్ని మొత్తం భూ విస్తీర్ణంలో శాతంగా లెక్కించింది.
బొగ్గును మండించి విద్యుత్ ని ఉత్పత్తి చేసే ధర్మల్ విద్యుత్ ప్లాంటులు తమ చుట్టూ ఉన్న భూ వినియోగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దానితో పాటు బొగ్గు తవ్వకానికీ, రవాణాకు కూడా పెద్ద మొత్తంలో భూ వనరులు అవసరం అవుతాయి. ఒక ఆనకట్ట సగటున 31,340 మంది జనాన్ని ఉన్న చోటినుండి తరలిస్తుందనీ, 8,748 హెక్టార్ల భూమిని ముంచివేస్తుందనీ అధ్యయనం తెలిపింది. అణు విద్యుత్ ప్లాంటు విషయానికి వస్తే, ప్లాంటు నిర్మాణానికి అవసరమైన భూమితో పాటు ‘బఫర్ జోన్’ కోసం అదనపు భూమి అవసరం అవుతుంది. అణు వ్యర్ధాలను నిలవ చేయడానికీ, యురేనియం ఇంధనం తవ్వకానికీ ఇంకా అదనపు భూ వనరులు అవసరమవుతాయి.
ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అధ్యయనం ఇలా పేర్కొంది. “మా అధ్యయనంలో తేలిందేమంటే, జీవ-చక్ర మార్పిడులను పరిగణలోకి తీసుకుంటే జల విద్యుత్ ప్లాంటులతో పోలిస్తే సౌర విద్యుత్ ఉత్పత్తికి తక్కువ భూమి సరిపోతుంది. కాగా, బొగ్గు, అణు విద్యుత్ ఉత్పత్తులతో పోలిస్తే సౌర విద్యుత్ ఉత్పత్తికి కాస్త అటు ఇటుగా ఒకే మొత్తం భూమి అవసరం అవుతుంది.” అని శ్రీనివాసన్ తెలిపాడు. అణు విద్యుత్, బొగ్గు విద్యుత్ ల ఉత్పత్తిలో బొగ్గు తవ్వకానికో, అణు వ్యర్ధాలను పారవేయడానికో నిరంతరం కొత్త భూమి అవసరం అవుతుంది. కానీ సౌర విద్యుత్ ఉత్పత్తికోసం ఆ అవసరం లేకపోగా సౌర పలకలు స్ధాపించిన చోటనే పశువులమేత లాంటివి కూడా పెంచవచ్చని అధ్యయనం తెలిపింది.
విద్యుత్ విధానాల విశ్లేషకుడు శంకర్ శర్మ ప్రకారం, ఐ.ఐ.ఎస్.సి ప్రొఫెసర్ల ప్రతిపాదనతో పాటు, ఇంటి కప్పులపై సౌర పలకలను స్ధాపించుకునే టెక్నాలజీని కూడా వినియోగంలోకి తెస్తే అది విద్యుత్ రంగ ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చివేస్తుంది. రూఫ్-టాప్ సోలార్ పవర్ టెక్నాలజీ ద్వారా “విద్యుత్ డిమాండ్ లో పెద్దమొత్తాన్ని తీర్చుకోవచ్చు. విద్యుత్ రంగం మొత్తాన్ని సమూలంగా మార్చివేయగల శక్తి దీనికి ఉంది” అని శంకర్ శర్మ చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది. శంకర్ శర్మ రచించిన ‘ఇంటెగ్రేటెడ్ పవర్ పాలసీ’ పుస్తకం త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఐ.ఐ.ఎస్.సి లో మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న సౌర విద్యుత్ నిపుణుడు అతుల్ చోక్సీ దీనితో ఏకీభవించాడు. మూడు కిలోవాట్ల రూఫ్-టాప్ సోలార్ పవర్ పానెల్ సిస్టమ్ లను దేశంలోని 425 మిలియన్ల ఇళ్లపై ప్రతిష్టించినట్లయితే సంవత్సరానికి 1900 TWh విద్యుత్ ని ఉత్పత్తి చేయవచ్చని అతుల్ ఇటీవల చెప్పాడని పత్రిక తెలిపీంది. 2070 నాటికల్లా దేశానికి అవసరమైన చెబుతున్న విద్యుత్ లో ఇది సగం మొత్తం అని గమనిస్తే సౌర విద్యుత్ ఎంత ఉపయోగమో అర్ధం చేసుకోవచ్చు.
ఐ.ఐ.ఎస్.సి అధ్యయన నివేదిక నేపధ్యంలో అణు విద్యుత్ తప్ప దేశానికి గతిలేదని చెప్పడం కంపెనీల కోసమే తప్ప ప్రజలకోసం మాత్రం కాదని గ్రహించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి