21, జనవరి 2013, సోమవారం

బహుళజాతి కంపెనీల కోసం......

బహుళజాతి కంపెనీల కోసం డబ్బులు కాసే కేన్సర్ చెట్లు

cancer is curable NOW“డబ్బులు చెట్లకు కాయవు” ఇది మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఇష్టమైన నీతి సూత్రం. కానీ సాటి మనుషుల జబ్బులనే డబ్బు చెట్లుగా మార్చుకోగల బహుళజాతి కంపెనీల యజమానులు, వారికి యధాశక్తి తోడ్పడే డబ్బు జబ్బుల డాక్టర్లు మసలే పాడు లోకంలో డబ్బులు కుప్పలుగా కాసే కేన్సర్ తోటలు విరివిగా వర్ధిల్లుతున్నాయి. కేన్సర్ ఇప్పుడొక బడా వ్యాపారం అంటే తప్పేం లేదు. అటు ఉత్తర అమెరికా, యూరప్ ల నుండి ఇటు ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ల వరకూ కేన్సర్ వ్యాధి గుర్తించే పేరుతో పెద్ద ఎత్తున పబ్లిక్ స్క్రీనింగ్ కార్యక్రమాలు కొనసాగుతూ, కేన్సర్ నయం చేసే మందుల గురించి ప్రచారం కూడా జరుగుతున్నప్పటికీ కేన్సర్ రోగులు పెరుగుతూనే ఉన్నారు. కొన్ని కంపెనీలు ఒక పక్క కేన్సర్ కి దారితీసే రసాయనాలు ఉత్పత్తి చేసి లాభాలు సంపాదిస్తూనే, మరోపక్క కేన్సర్ నయం చేసే మందులు కూడా తయారు చేస్తున్నాయి. రోగం, వైద్యం రెండూ ఒకరే ఇస్తే కేన్సర్ ఎలా వర్ధిల్లుతుందో సదరు కంపెనీల లాభాలే చెబుతున్నాయని శాస్త్ర, వైద్య విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ప్రకారం 2010లో విడుదలయిన ‘Cut, Poison, Burn‘ అనే డాక్యుమెంటరీలో కేన్సర్ వైద్యంపై బహుళజాతి కంపెనీలు ఏ విధంగా గుత్త స్వామ్యం వహిస్తున్నాయో వివరంగా చర్చించబడింది. బ్రెయిన్ కేన్సర్ తో బాధపడుతున్న ఒక నాలుగేళ్ల పిల్లాడికి అతని తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా కెమో ధెరపీ, సర్జరీ, రేడియేషన్ అన్నీ చేసిన విషయం డాక్యుమెంటరీలో చూపారు. రుజువు చేయబడిన ప్రత్యామ్నాయ కేన్సర్ వైద్యాన్ని ఆశ్రయించడానికి ప్రభుత్వాధికారులు ఒప్పుకోలేదు. తల్లిదండ్రుల విన్నపాన్ని వైద్య వ్యవస్థ అధికారులు మూర్ఖంగా తిరస్కరించారు. తాము సూచించిన వైద్య చికిత్సా విధానానికి అంగీకరించకపోతే వారి పిల్లాడిని తమ కస్టడీలోకి తీసుకుంటామని, పిల్లాడిని వేధించారన్న (child abuse) నేరం మోపి ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుందనీ అధికారులు తల్లిదండ్రులను బెదిరించారు. చివరికి ఆ పిల్లాడు చనిపోయాడు. పిల్లాడి మరణ ధృవీకరణ పత్రం ప్రకారం “కెమో ధెరపీ వల్ల ఏర్పడిన విష వ్యర్ధాల వలన ఊపిరి ఆడక అబ్బాయి చనిపోయాడు.” అంటే ఏ చికిత్సని పిల్లాడి తల్లిదండ్రులు నిరాకరించారో దాని వల్లనే వారి పిల్లాడు చనిపోయాడు. ఈ కేసు అమెరికాలో సృష్టించిన అలజడి త్వరలోనే సమసిపోయింది.
కేన్సర్ రోగుల వృద్ధిపై ఆధారపడి వర్ధిల్లుతున్న అవినీతి రాకెట్ గురించి వివరిస్తూ 2009లో ‘ద ఇడియట్ సైకిల్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందించబడింది. దీని ప్రకారం కేన్సర్ కారక రసాయనాలు తయారు చేసి అమ్మే ప్రపంచ ప్రసిద్ధ బహుళజాతి కంపెనీలే కేన్సర్ జబ్బుకి ఔషధాలు కూడా తయారు చేసి ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయి. బేయర్, బి.ఎ.ఎస్.ఎఫ్, డౌ కెమికల్స్, డ్యుపాంట్, మాన్శాంటో, సింజెంటా, నొవార్టిస్ మొదలయిన కంపెనీలు రసాయన పురుగు మందులు, ఎరువులు తయారు చేసే బడా బహుళజాతి కంపెనీలు. ఇవి తయారు చేసే రసాయనాల్లో అనేకం కేన్సర్ కారక ఉత్పత్తులు. ఈ కంపెనీలే మళ్ళీ భారీ లాభాలు వచ్చే కేన్సర్ చికిత్సపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్నాయని డాక్యుమెంటరీ తెలియజేసిందని గ్లోబల్ రీసెర్చ్ తెలిపింది.
వీటిలో మాన్శాంటో లాంటి కంపెనీలు జి.ఎం (Genetically Modified) విత్తన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. భారత దేశంలో మహారాష్ట్ర హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ (మహికో) దీనికి భాగస్వామ్య సంస్థగా వ్యవహరిస్తోంది. జి.ఎం పంటల వలన కేన్సర్ జబ్బులు వస్తాయని పలువురు శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు వాదిస్తున్నప్పటికీ పూర్తిస్థాయి పరిశోధనలు, పరీక్షలు ఇప్పటివరకూ జరగలేదు. కానీ బి.టి పత్తి ఇండియాలో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. అసలు పురుగే సోకదన్న కంపెనీ వాదనలో నిజం లేదని బి.టి పత్తి దిగుబడి రుజువు చేసింది. పురుగు తగ్గడం అటుంచి నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకుని మరింత శక్తివంతంగా వ్యాపించడమే కాక ఇతర పంటలకు, పక్క పొలాలకు వ్యాపించిందని ఇండియా అనుభవాలు చెబుతున్నాయి. ఇదొక విషయం కాగా, జి.ఎం పంటల వల్ల కేన్సర్ సోకుతుందన్న భయాలు ఇప్పటికీ తొలగకపోవడం మరో విషయం. కేన్సర్ బైట పడడానికి 15, 20 సంవత్సరాలు పడుతుంది. ఈ లోగానే జరగాల్సిన నష్టం జరిగితే తర్వాత సమాధానం చెప్పే నాధుడే ఉండడని భోపాల్ విష వాయువు దుర్ఘటన స్పష్టం చేసిన వాస్తవం.
Cut, Poison, Burn
Cut, Poison, Burn
యూనివర్సిటీ ఆఫ్ కేన్ (ఫ్రాన్స్) ప్రొఫెసర్ గిల్లెస్-ఎరిక్ సెరాలిని జి.ఎం పంటలపై విస్తృత పరిశోధన నిర్వహించాడు. జి.ఎం.ఒ (Genetically Modified Organisms – జన్యు పరంగా మార్పులకు గురి చేసిన జీవులు) ల వలన మానవుల ఆరోగ్యంపై కలిగే ప్రభావాలను ఈయన అధ్యయనం చేస్తున్నాడు. దానికి ముందు ఎలుకలపై ఆయన చేసిన పరిశోధనల ఫలితాలు భయం కొలుపుతున్నాయి. కేవలం మూడు నెలలు మాత్రమే పరిశోధన చేసి జి.ఎం మొక్కజొన్న వలన దుష్ఫలితాలేవీ లేవని చెప్పి డజను పైగా దేశాలు దానిని అనుమతించడం పూర్తిగా అర్ధం లేనిదని ఆయన తన పరిశోధనలకు ముందే స్పష్టం చేశాడు. మాన్శాంటో తయారు చేసిన మొక్కజొన్నను ఎలుకలకు తినిపించి ఆయన బృందం పరిశోధనలు నిర్వహించింది. తద్వారా వెలువడిన ముడి వివరాల ప్రకారం మొక్కజొన్న తిన్న మూడు నెలలకే ఎలుకల ఆరోగ్యం దెబ్బతిన్నది. కాలేయం పూర్తిగా దెబ్బతినగా, దాని శరీర ధర్మాలు డయాబెటిస్ ముందర పరిస్ధితికి మారిపోయాయి. రెండు సంవత్సరాలు సాగే గిల్లెస్ నూతన పరిశోధన ఇంకా పూర్తి కానట్లు తెలుస్తోంది.
కేన్సర్ రోగులు క్రమంగా పెరుగుతున్నారు. 2050 నాటికి వారి సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏవో కొన్ని దేశాలకు అది పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ సమస్యగా రూపు దాల్చింది. ఉదాహరణకి మానవ శరీరంలోని ప్రధాన అంగాలకు కేన్సర్ సోకుతున్న ఇండియా కేసులు ప్రపంచంలోనే అధికంగా ఉన్నాయి. పొగాకు వాడకం దానికి ముఖ్య కారణం అని చెబుతున్నా, ఇతర కారణాలను ఎవరూ కొట్టివేయడం లేదు. ఇండియా పట్టణాల్లో రొమ్ము కేన్సర్ పెరుగుతోందని పత్రికల్లో వచ్చిన ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. తమిళనాడులోని టెక్స్ టైల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో కేన్సర్ కేసులు పెరిగాయని 2009నాటి నివేదికలు తెలిపాయి. పరిశ్రమల్లో వినియోగించిన రసాయనాలతో కలుషితం అయిన నీటిని తాగడం వల్ల కేన్సర్ కేసులు పెరిగి ఉండొచ్చని సదరు నివేదికలు స్పష్టం చేశాయి. సరైన ప్రభుత్వ నియంత్రణ లేనందున ఈ పరిస్ధితిలో మార్పు ఉండదని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అమెరికాలోనూ ఇదే పరిస్ధితి. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ప్రొఫెసర్ డాక్టర్ శామ్యూల్ ఎపిస్టీన్ ప్రకారం అమెరికాలో పెట్రో కెమికల్స్ లాంటి కార్సినోజెన్ (కర్బన ఉద్గారాల ఉత్పాదకాలు) ఉత్పాదక రంగాల్లోని వివిధ పరిశ్రమలు గాలి, భూమి, సముద్రం అన్నిటినీ కలుషితం చేశాయి. ఇవి ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయడమే కాక, నిర్దిష్ట పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వారి పిల్లలను కేన్సర్ ప్రమాదానికి గురి చేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాలో హాకిన్స్ లింఫోమా యేతర కేన్సర్ 100 శాతం పెరిగిందని ఎపిస్టీన్ తెలిపాడు. మెదడు కేన్సర్ 80 నుండి 90 శాతం వరకూ, రొమ్ము కేన్సర్ 60 నుండి 65 శాతం వరకూ పెరిగిందని ఆయన తెలిపాడు. ముఖ్యంగా 28-35 యేళ్ల పురుషుల్లో టెస్టిక్యులార్ కేన్సర్ 300 శాతం పెరిగిందని తెలిపాడు. పొగ తాగడం, వయసు మీరడం, వంశపారంపర్యం, కొవ్వు పెరగడం… లాంటి కారణాలతో ఈ కేన్సర్ పెరుగుదలను వివరించలేమని ఎపిస్టీన్ అభిప్రాయం. దానికాయన అనేక ఉదాహరణలు ఇచ్చాడు.
కాస్మోటిక్స్, టాయిలేటరీస్ మొదలయిన ఉత్పత్తులు కేన్సర్ కి దోహదం చేస్తున్నాయని ఎపిస్టీన్ చెబుతున్నాడు. డియోడెరెంట్, షాంపూలు, టాల్కం పౌడర్ల నుండి అనేక ఉత్పత్తుల వరకు అనేకం కర్బన ఉద్గారాలను వెదజల్లే రసాయనాలు కలిగినవేనని ఆయన తెలిపాడు. సింధటిక్ రసాయనాలను అనేక రోజువారీ వినియోగ వస్తువులలో వాడుతున్నందున అవి ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. సరికొత్త సింధటిక్ రసాయనం మార్కెట్ లోకి వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు పెద్దగా పరీక్షలు లేకుండానే అనుమతి ఇచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఔషధ రంగంలో ఈ విధమైన ఉదాసీనత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. ఈ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు తాము తయారుచేసే ఔషధాలపై పరిశోధనల కోసం, పరీక్షల కోసం వెచ్చించే మొత్తం కంటే తరచుగా లాబీయింగ్ (లంచాల చెల్లింపులు) కోసం, మార్కెటింగ్ కోసం వెచ్చించే మొత్తమే ఎక్కువగా ఉంటుంది గనుక ప్రభుత్వాల ఉదాసీనత పెద్దగా ఆశ్చర్య పడవలసిన సంగతి కాకపోవచ్చు.
ప్రభుత్వ, అధికార వ్యవస్థలు తమ బాధ్యత నుండి తప్పుకోవడానికి సాధారణంగా అనుసరించే ఎత్తుగడ ఏమిటంటే, అవి ఆరోగ్య సమస్యలను వ్యక్తిగత స్థాయికి పరిమితం చేస్తాయి. వారి వారి అలవాట్లను మానుకోవాలని ప్రచారం చేయడం ద్వారా సర్వ రోగాలకు కారణం వారే అని నమ్మిస్తాయి. కొన్ని అలవాట్లు మానుకుంటే కొన్ని జబ్బులు దరిచేరవన్నది నిజమే అయినా అదే పూర్తి సత్యం మాత్రం కాదు. ఇటీవల పెచ్చు మీరిన ప్రధాన కేన్సర్ జబ్బుల విషయంలో మనిషి వ్యక్తిగత స్థాయిలో చేయగలిగింది ఏమీ లేదు. రోగులనే బాధ్యులను చేయడం ద్వారా కేన్సర్ కారక రసాయనాలను విస్తృతంగా తయారు చేస్తూ వాతావరణాన్ని అనేక విధాలుగా కలుషితం చేస్తున్న లాభార్జన పరమైన బహుళజాతి కంపెనీల నేరస్థ వ్యాపారాలను, కార్యకలాపాలనూ కప్పిపుచ్చుతున్నాయి ప్రభుత్వాలు.
కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన శాస్త్రవేత్త డాక్టర్ శివ చోప్రా ఉదాహరణ చెప్పుకోవడం సముచితం. తెలిసి తెలిసీ అనేక ప్రమాదకర ఔషధాలను మార్కెట్ లోకి అనుమతించిన కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అనేక పోరాటాలు నిర్వహించాడు. ప్రమాదకరమైన ఔషధాలు, వ్యవసాయ కార్యకలాపాలు, కార్సినోజెన్ పురుగు మందులు లాంటి అనేక ఉత్పత్తులను కెనడా ప్రభుత్వం అనుమతించిందని దాని వలన ప్రమాదకర కర్బనాలు ఆహార చక్రంలోకి ప్రవేశించి కేన్సర్ కారకాలుగా పని చేస్తున్నాయని శివ తెలిపాడు. శివ ప్రకారం ప్రజలను మొదట జబ్బులకు గురి చేసి ఆ తర్వాత ఔషధాలు తయారు చేసి అమ్ముకొని లాభాలు సంపాదించడానికి కంపెనీలు నిర్దిష్టంగా, స్థిరమైన కృషి చేస్తున్నాయి. శివ చోప్రా లాంటి ప్రజోపయోగ శాస్త్రవేత్తల కృషి ఎంత విలువైనదో చెప్పనవసరం లేదు. వివిధ ఉత్పత్తులలో కార్సినోజెనిక్ రసాయనాలు వాడకుండా నిరోధించడానికి అనేక సంస్థలు కృషి చేస్తున్నాయి. కానీ బహుళజాతి కంపెనీల ధన, రాజ్య బలం ముందు వారి కృషి ఎంతవరకు పని చేస్తుంది? ఇటువంటి అవినీతికర దోపిడీ వ్యవస్థలకు అవకాశం ఇచ్చే సామాజిక, రాజ్య వ్యవస్థలు ఉన్నంత కాలం కేన్సర్ ని సంపూర్ణంగా నివారించడం అసాధ్యం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి