28, జనవరి 2013, సోమవారం

భయాన్ని పుట్టిస్తున్న బయోమెడికల్ వేస్ట్

ఆసుపత్రుల వ్యర్దాలతో అనర్ధమే.....
 :అధికారులు లంచాలకు బాగా అలవాటు పడిపోవడం వలన రాష్టవ్య్రాప్తంగా ఆసుపత్రుల వ్యర్ధాలు ప్రజలకు అనర్థాలను తెచ్చిపెడుతున్నాయి. వ్యాధులను నయం చేసుకునేందుకు ఆసుపత్రులకు వస్తున్న వారికి కొత్త వ్యాధులను అంటిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో వాడి పారేసిన వ్యర్ధాలను నిర్వీర్యం చేసే వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు కలుషిత నీరు దిక్కుగా మారింది. ప్రజలకు వచ్చే జబ్బుల్లో దాదాపు 80శాతం వరకు కలుషితం నీటి వాడకం వల్ల వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించినా అధికారులు ఆ దిశగా స్పందించడంలేదు. నివాస ప్రాంతాల్లో పైపులైన్ల లీకేజీల వల్ల నీరు కలుషితమై ప్రజలు తరచు అస్వస్థతకు గురవుతున్నారు. చికిత్స కోసం వెళుతున్న ఆసుపత్రుల్లోనే తాగునీటిలో రోగకారక బాక్టీరియం ఉండడం ప్రజలను మరింత ఆందోళనకు గురి చేసే విషయం.
 రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నిత్యం పెద్ద సంఖ్యలో సర్జరీలు జరుగుతున్నాయి. వీటి ద్వారా వెలువడుతున్న వ్యర్ధాలను నిర్వీర్యం చేయకుండా జనావాసాలకు దూరంగా పారవేస్తుండడంతో వాటి వల్ల పలు వ్యాధులు సోకుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జీవ వైద్య వ్యర్థ నివారణ (బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌) ప్రక్రియను పట్టించుకోవడంలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన సర్వేలో సైతం ఈ విషయం వెల్లడైంది. వ్యర్ధాలను ఎలా నిర్వీర్యం చేయాలన్న విషయంపై కూడా ఇటు వైద్యులకు, అటు సిబ్బందికి కనీస అవగాహన కూడా ఉండడం లేదని తేలింది. వైద్యశాలల్లో వెలువడుతున్న వ్యర్థాల్లో 80 శాతం వరకు అంటు వ్యాధులను వ్యాప్తి చేసే లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.తద్వారా పర్యావరణంతోపాటు ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రోగులకు నిర్వహించే పరీక్షల సమయంలో వెలువడే వ్యర్ధాలు అత్యంత ప్రమాదకరమైనవని, వాటి నిర్వీర్యం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సి ఉన్నా ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పాటించడంలేదని పరిశోధనల్లో వెల్లడైంది. ప్రజలకు వస్తున్న వ్యాధుల్లో 20 శాతం వరకు అపరిశుభ్రత వాతావరణం వల్ల అంటువ్యాధుల రూపంలో వస్తున్నాయని తెలుస్తోంది. ప్రతి ఆసుపత్రికి సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఉండాలన్న నిబంధన కూడా ఎక్కడా పాటించడంలేదు. ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చే సమయాల్లోనే ఖచ్చితమైన గైడ్‌లైన్స్‌ పెడితే కొంత మేరైనా ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
 
పీసీబీ మార్గదర్శాలు ఇవీ...
* గ్రామీణ ప్రాంతాలలో అయితే 2 మీటర్ల గుంతను తీసి వ్యర్దాలను అందులో వేసి పూడ్చిపెట్టాలి. జనవాసాల వద్ద వీటి వినియోగం ఉన్న చోట కాకుండా దూరంగా భూగర్భ నిల్వ తక్కువ ఉన్న చోట ఈ పనిచేయాలి.
* శరీర సంబంధ వ్యర్థాలను బూడి చేసి నాశనం చేసేందుకు సంబంధిత సంస్థకు పంపాలి. లోతుగా గుంటల్లో కూడా పూడ్చిపెట్టవచ్చు.
* పదునైన వ్యర్ధాలైన బ్లేడ్లు, సూదులు, సిరంజిలు, గాజు తదితర పరికరాలను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని ఉపయోగించి అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చేసి అనంతర గుంతల్లో పూడ్డి పెట్టాలి.
* వైద్య సిబ్బంది రోగులకు సంబంధించిన ఎటువంటి పనులు చేసినా, పరిశోధనా వాలలో నమూనాల సేకరణ చేశాక సబ్బుతో చేతులు కడుక్కోవడం అత్యంత ముఖ్యం
* వ్యర్ధాలను తీస్తున్నపుడు చేతి తొడుగులు, కళ్లద్దాలు, మాస్క్‌లు, అఫ్రాన్‌, బూట్లు వంటివి ధరించాలి.
* వైద్య శాలలు, నర్సింగ్‌ హోమ్‌లు, క్లినిక్‌లు, పశు వైద్యవాలలు, వ్యాధి నిర్థారణ పరిశోధనా శాలలు, రక్తనిధి కేంద్రాల్లో వెలువడే వ్యర్ధాలను పీసీబీ సూచించినట్లు వేర్వేరుగా నాశనం చేయాలి.వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి